🏠 www.veguchukkanews.online
Watermark
Newspaper Logo
www.veguchukkanews.online | Date: 23 Jun, 2026 | Page: 1

గల్ఫ్ కార్మికుల ఓటు హక్కులను పరిరక్షించాలి: సాటా సౌదీ అరేబియా రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చ


రియాద్: ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం సందర్భంగా విదేశాల్లో నివసిస్తున్న గల్ఫ్ కార్మికులు, ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) తమ ఓటరు హక్కులను కోల్పోకుండా ఉండేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని సాటా (SATA) సౌదీ అరేబియా – రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చ విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన గల్ఫ్ కార్మికులు, ఎన్నారైలు తమ పేర్లు ఓటరు జాబితాల్లో కొనసాగించుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా ఆన్‌లైన్ ఓటరు నమోదు, సవరణ, ధృవీకరణ సేవలను మరింత సులభతరం చేసి విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాలను కోరారు.

ప్రవాస తెలుగు ప్రజలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని శ్రీనివాస్ మచ్చ పేర్కొన్నారు. వారి సమస్యల పరిష్కారం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన అన్నారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు కాబట్టి, విదేశాల్లో నివసిస్తున్న అర్హులైన భారతీయుల ఓటు హక్కులను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా, గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల ఓటు హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, ఎన్నికల సంఘంతో సమన్వయం చేస్తూ భారత రాయబార కార్యాలయం (ఎంబసీ ఆఫ్ ఇండియా) కూడా సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సాటా వ్యవస్థాపకుడు మల్లేశం, ప్రాంతీయ అధ్యక్షులు శర్వాణి విద్యాధరణి, తేజ పళ్లెం, పామిరెడ్డి రామిరెడ్డి, కోర్ టీం సభ్యులు కోకిల ఒత్తూరి, ప్రీతి చౌహాన్, మహమ్మద్ నూరుద్దీన్, యోగేశ్వరరావు వీరపల్లి, సింగు సురేష్ కుమార్, అహ్మద్ అబ్దుల్ కరీమ్, మహమ్మద్ అబ్దుల్ ఘఫ్ఫార్, మిధున్ సురేష్, ముదిగొండ శంకర్, మురళీకృష్ణ బూసి, లోకేష్ తాళ్ల, అబ్దుల్ నయీం ఖయ్యూమ్, ఖాజా ముజమ్మిల్ ఉద్దీన్, అహ్మద్ మొహియుద్దీన్, రోల్దార్ సయ్యద్ (ఆస్లాం), ఫణికుమార్ అయ్యగారి, పెంటపాటి శ్రీచరణ్, మహమ్మద్ కమిల్, దూడం సంజీవ్, శేఖర్ పడాల తదితరులు పాల్గొని, ప్రవాస తెలుగు ప్రజల ఓటు హక్కులను పరిరక్షించి, ఓటరు నమోదు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
🏠 Home