🏠 www.veguchukkanews.online
Watermark
Newspaper Logo
www.veguchukkanews.online | Date: 07 Oct, 2026 | Page: 1

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. - పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య.


- సైబర్ మోసంలో డబ్బులు కోల్పోయిన వెంటనే 1930కు ఫోన్ చేయాలనీ వెల్లడి.

- కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ కళాశాలలో సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం.

- పాల్గొన్న కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్ సిహెచ్. రజనికాంత్.

వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలనీ
పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అన్నారు.
సైబర్ మోసంలో డబ్బులు కోల్పోయిన వెంటనే 1930కు ఫోన్ చేయాలనీ సూచించారు. నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ప్రజలు, ముఖ్యంగా విద్యార్థినులు అప్రమత్తంగా ఉండేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని బుధవారం కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పాల్గొని, ప్రసంగించారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా రోజురోజుకూ కొత్త రూపాల్లో జరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారా అనేక మోసాలను నివారించవచ్చని తెలిపారు. సైబర్ నేరగాళ్లు ప్రజల అత్యాశ , భయం , అత్యవసర పరిస్థితులు , ఉద్యోగాల అవసరం వంటి అంశాలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు.

ప్రధానంగా ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ , డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ , సోషల్ మీడియా ఫేక్ ప్రొఫైల్ ఫ్రాడ్ , డీప్‌ఫేక్ ఫ్రాడ్ , పార్ట్‌టైమ్ జాబ్ ఫ్రాడ్ , లోన్ ఫ్రాడ్ , ఆన్‌లైన్ షాపింగ్ ఫ్రాడ్ తదితర సైబర్ మోసాల తీరును విద్యార్థినులకు వివరించారు.

*ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ విషయంలో*

అధిక లాభాలు వస్తాయని నమ్మించి నకిలీ యాప్‌లు , వాట్సాప్/టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా పెట్టుబడులు పెట్టించి భారీ మొత్తంలో డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపించే పెట్టుబడి లింకులు, యాప్‌లను నమ్మవద్దని సూచించారు.

*డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ లో*

పోలీస్ , సిబిఐ , ఏది , కస్టమ్స్ తదితర ప్రభుత్వ సంస్థల అధికారులుగా నకిలీ వీడియో కాల్స్ చేసి కేసుల్లో ఇరుక్కున్నారని భయపెట్టి డబ్బులు బదిలీ చేయించుకుంటారని తెలిపారు. ఏ ప్రభుత్వ సంస్థ కూడా వీడియో కాల్ ద్వారా ‘డిజిటల్ అరెస్ట్’ చేసి డబ్బులు చెల్లించాలని ఆదేశించదని స్పష్టం చేశారు.

*సోషల్ మీడియా ఫేక్ ప్రొఫైల్ , డీప్‌ఫేక్ మోసాల పట్ల*

కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యక్తుల ఫొటోలు , వీడియోలు , పేర్లను దుర్వినియోగం చేసి నకిలీ ఖాతాలు సృష్టించడం , AI సాంకేతికతను ఉపయోగించి మార్ఫింగ్ / డీప్‌ఫేక్ వీడియోలు రూపొందించడం ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు.

*పార్ట్‌టైమ్ జాబ్ , లోన్ , ఆన్‌లైన్ షాపింగ్*

పేరుతో జరిగే మోసాల పట్ల కూడా జాగ్రత్త వహించాలని తెలిపారు. తెలియని వ్యక్తులకు ఓటిపి లు, పిఐఎన్ లు, సివివిలు, పాస్‌వర్డ్‌లు , బ్యాంక్ వివరాలు , వ్యక్తిగత సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని సూచించారు.

*డబ్బులు పోయిన వెంటనే ‘గోల్డెన్ అవర్’లో 1930కు సమాచారం ఇవ్వాలి*

సైబర్ మోసంలో డబ్బులు కోల్పోయినట్లయితే బాధితులు భయపడకుండా వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. సైబర్ మోసం జరిగిన వెంటనే స్పందించే సమయం అత్యంత కీలకమని , ప్రారంభ దశలో ఫిర్యాదు చేయడం ద్వారా మోసపోయిన నగదును నిలిపివేసే అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా https://cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా సైబర్ నేరంపై ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. సైబర్ నేరం జరిగినప్పుడు ఆలస్యం చేయకుండా బ్యాంకు/సంబంధిత ఆర్థిక సంస్థలకు కూడా సమాచారం అందించాలని తెలిపారు. విద్యార్థినులు తాము సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించడంతో పాటు , తమ కుటుంబ సభ్యులు , స్నేహితులు మరియు పరిచయస్తులకు కూడా సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసిపి ప్రకాష్ యాదవ్, కాకతీయ ఇన్స్టిట్యూట్స్ డైరెక్టర్ రజనీకాంత్, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ సిఐ శ్రీముఖి పాష, మాక్లూర్ ఎస్సై అనిల్ రెడ్డి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
🏠 Home