డిఏ ఏరియర్స్ మూడు విడుతలలో చెల్లించాలి. - టిపిటిఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్.
వేగుచుక్క న్యూస్, హైదరాబాద్: సిపిఎస్ ఉద్యోగుల, పెన్షనర్ల డిఏ ఏరియర్స్ మూడు లేదా నాలుగు విడుతలలో చెల్లించాలనీ టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతిలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగులో ఉన్న ఐదు డీఏలలో రెండు డీఏల ఉత్తర్వులు 128, 130 లను బుధవారం విడుదల చేసింది. మొదటి డి ఏ బకాయిలను సిపిఎస్ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 33 వాయిదాల ద్వారా 33 నెలల్లో చెల్లిస్తామని, రెండవ డి ఏ బకాయిలను 27 వాయిదాల ద్వారా 27 నెలల్లో చెల్లిస్తామని ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇచ్చిన డి ఏ బకాయిలు ఉద్యోగుల ఖాతాలోకి జమ చేయడంలో ప్రభుత్వం తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శించడంతో ఉద్యోగులు నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం విడుదల చేసిన డిఎలకు సంబంధించిన బకాయిలు 33 నెలలు మరియు 27 నెలల్లో చెల్లిస్తామని తాత్సారం చేసే ఉత్తర్వులు ఇవ్వడం సరైనది కాదనీ టీపీటీఎఫ్ నాయకులు పేర్కొన్నారు. వీటివల్ల సిపిఎస్ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆర్థిక నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల పరిస్థితులపై సానుకూల దృక్పథంతో ఆలోచించి మూడు లేదా నాలుగు వాయిదాలలో డిఏ బకాయిలను సిపిఎస్ మరియు పెన్షనర్ల ఖాతాలకు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.