లాలన వృద్ధాశ్రమంలో... ఆప్యాయత పంచిన సిపి. - వృద్ధుల బాగోగులు క్షుణ్ణంగా తెలుసుకున్న పోలీస్ కమిషనర్.
- సుమారు 60 మంది వృద్ధులకు దుస్తుల పంపిణీ , స్వయంగా భోజనం వడ్డింపు.
- ప్రముఖ వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహణ.
వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: వృద్ధుల పట్ల మానవత్వం, ఆప్యాయత, సామాజిక బాధ్యతను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య చాటారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకాపూర్ గ్రామంలోని లాలన వృద్ధాశ్రమాన్ని గురువారం సిపి సందర్శించారు. వృద్ధాశ్రమంలో నివసిస్తున్న సుమారు 60 మంది వృద్ధుల బాగోగులను క్షుణ్ణంగా అడిగి తెలుసుకొని , వారి ఆరోగ్య పరిస్థితులు , జీవన విధానం, వ్యక్తిగత సమస్యలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. వృద్ధాశ్రమంలోని ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడిన పోలీస్ కమిషనర్ , వారి అనుభవాలను, ఆలోచనలను, అవసరాలను తెలుసుకున్నారు. వారి జీవన పరిస్థితులను అర్థం చేసుకుంటూ , వారికి భరోసా కల్పించేలా ఆప్యాయంగా పలకరించారు.
*వృద్ధులకు దుస్తుల పంపిణీ మరియు స్వయంగా భోజనం వడ్డింపు*
ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు పోలీస్ కమిషనర్ దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం వారందరికీ స్వయంగా మధ్యాహ్న భోజనం వడ్డించి , వారితో కలిసి భోజనం చేశారు. పోలీస్ కమిషనర్ స్వయంగా తమ వద్దకు వచ్చి పలకరించడం , తమకు దుస్తులు పంపిణీ చేయడంతో పాటు భోజనం వడ్డించడంపై వృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు.
*వృద్ధుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి : పోలీస్ కమిషనర్*
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సమాజంలో వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఆలోచనా విధానం, భావోద్వేగాలు, జీవన స్థితిగతులను ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. వృద్ధుల జీవిత అనుభవాలను గౌరవిస్తూ, వారి అవసరాలను గుర్తించి, వారికి తగిన సహకారం అందించాలన్నారు. వృద్ధాప్యంలో అనేక మంది శారీరకంగా, మానసికంగా వివిధ ఇబ్బందులను ఎదుర్కొంటుంటారని , అలాంటి సమయంలో వారికి కుటుంబ సభ్యులు, బంధువులు, సమాజం నుంచి ప్రేమ, ఆప్యాయత, గౌరవం, మానసిక ధైర్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. వృద్ధులను నిర్లక్ష్యం చేయకుండా, వారి సమస్యలను ఓపికగా విని, వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని సూచించారు. సమాజంలో నెలకొన్న వివిధ సామాజిక సమస్యలను అర్థం చేసుకోవాలంటే క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి వారి జీవన పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా వృద్ధాశ్రమాల్లో నివసిస్తున్న వృద్ధుల అవసరాలు , వారి ఆరోగ్య పరిస్థితులు , సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మానవీయ విలువలకు ప్రాధాన్యతనిస్తూ , ఆపదలో ఉన్నవారికి , సహాయం అవసరమైన వారికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
*ప్రముఖ వైద్యులతో వైద్య పరీక్షలు*
ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ ప్రాంతానికి చెందిన ప్రముఖ వైద్యులచే వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి , అవసరమైన వైద్య సలహాలు , సూచనలు అందించారు. పోలీస్ శాఖ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సమాజంలో మానవీయ విలువలు , సామాజిక బాధ్యత , సేవాభావాన్ని పెంపొందించే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తోందనే సందేశాన్ని ఈ పర్యటన చాటిచెప్పింది. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎసిపి వెంకటేశ్వర రెడ్డి, సిసిఆర్ బి ఎసిపి గురు నాయుడు, ఆర్మూర్ రూరల్ సిఐ జాన్ రెడ్డి, భీంగల్ సిఐ సత్యనారాయణ గౌడ్, ఆర్మూర్ ఎస్హెచ్ఓ చంద్రశేఖర్ రెడ్డి మరియు డాక్టర్ శంకర్ (పిడియాట్రిక్), డాక్టర్ మధుశేఖర్ (జనరల్ సర్జన్), డాక్టర్ వంశీ (డయాబెటిక్), డాక్టర్ ముత్యంరెడ్డి (జనరల్ సర్జన్), డాక్టర్ లింగారెడ్డి (జనరల్ ఫిజీషియన్), డాక్టర్ ధనపాల్ సదన్ (డెంటల్) మరియు వృద్ధాశ్రమానికి సంబంధించిన సునీత, నాగమణి, దామోదర్ రెడ్డి, సంకీత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.