EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పరిణామం చెందని "జర్నలిస్టు" బతుకులు..

    పరిణామం చెందని "జర్నలిస్టు" బతుకులు..

    - సమాజ మార్పు కోసం, నిజాయితీగా పనిచేస్తున్న "కలం వీరుల" సామాజిక కథనం..

    *వేగుచుక్క న్యూస్ :*

    పరిణామం చెందని "జర్నలిస్టు" బతుకులు.. - Additional Image

    కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదేమో.. నిత్య నూతనంగా ఎప్పుడూ పరిణామం చెందుతూ ఉంటుంది. మారకుండా ఉండిపోయిన తన జీవితాన్ని ఓసారి తడిమి చూసుకున్నాడు వెంకటేష్. నాలుగు దశాబ్దాలుగా సమాజంలో, మీడియా రంగంలో వస్తున్న మార్పులకు తానే ప్రత్యక్ష సాక్షిగా నిలబడ్డాడు. కరిగిపోయిన తన జీవితంలో కన్నీటి మాయమైన రోజులను తడిమి చూసుకుని, తనలో తానే ఓదార్చుకోవడం తప్ప ఎప్పుడూ ఎవరు భుజం తట్టిన దాఖలాలు లేవని మనసులో అనుకున్నాడు వెంకటేష్.ఆర్థికంగా అట్టడుగున మిగిలిపోయిన సమాజంలో మాత్రం సీనియర్ జర్నలిస్టుగా తెల్లచొక్కా వెనుక ఎన్నో విషాదపు నవ్వులను మోస్తూ జీవితాన్ని ఎప్పుడో కాలం చిలక్కొయ్యకు తగిలించాడు. మార్పు లేకుండా జీవితం చిలక్కొయ్యకు తగిలించిన చొక్కాలా మిగిలిపోతుందని అనుకోలేదు.

    *“జీవితమంతా చాయ్ బిస్కెట్లతో గడిచిపోయింది".*
    *
    తాను ఎక్కడ మొదలయ్యాడో ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు. తెల్ల పేపర్‌పై వార్తలు రాసి కవర్‌లో ఆర్టీసీ బస్సు ద్వారా వార్తలు పంపిన రోజుల నుంచి, తానే డీటీపీ ఆపరేటర్‌గా వార్తలు పంపిన పరిణామం నుంచి, వాట్సాప్ ద్వారా టైప్ చేస్తూ వార్తలు పంపించే సౌలభ్యం దాకా తెలుగు మీడియా రంగంలో వస్తున్న అనేక మార్పులకు అనుగుణంగా తాను మారుతూ, పోటీ ప్రపంచంలో నిలబడ్డాడు. నాలుగు దశాబ్దాల మీడియా పరిణామంతో పాటు వస్తున్న మార్పులకు సజీవ సాక్ష్యంగా ఉన్నాడు వెంకటేష్. మండల కేంద్రంలో విలేకరిగా ప్రారంభమై, ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నాడు.“జీవితమంతా చాయ్ బిస్కెట్ల కోసమే” కరిగిపోయిందని తనలో తానే నవ్వుకున్నాడు. తాను సంపాదించింది ఏమీ లేకపోయినా పిల్లలకు మంచి చదువు అయితే చెప్పించగలిగాడు. చదువులో చురుకైన వాడైనా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కొడుకును అడ్డుకోలేకపోయిన వెంకటేష్.. తెలంగాణ వచ్చిన తర్వాత వాని జీవితం ఎందుకో కొలువులేకుండా నిరుద్యోగిగా మిగిలిపోతుందని అనుకోలేదు. వెంకటేష్ కొడుకు కూడా అనుకోలేదు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నా, వచ్చిన తెలంగాణలో కొడుకు కొలువు తెచ్చుకోలేకపోయాడు. కొంతలో కొంత నయం.. అమ్మాయి మాత్రం సాఫ్ట్‌వేర్ రంగంలో రాణించింది. కిందా మీదా పడి రూ.20 లక్షలకు పైగా అప్పులు చేసి అమ్మాయి పెళ్లి అయితే చేశాడు వెంకటేష్.
    సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్నా, కనీసం ఉండడానికి సొంతంగా ఇల్లు కూడా లేకపోవడం.. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి ఇంటి అద్దెలు చెల్లించలేక అనుభవించిన జీవితం తాలూకు కష్టాలన్నీ ఒక్కొక్కటిగా వెంకటేష్ కండ్ల ముందు కదలాడాయి. నిబద్ధతతో పనిచేసిన తనలాంటి ఎంతోమంది జర్నలిస్టులు పెద్ద పెద్ద పేపర్లలో పనిచేసినా నిలదొక్కుకోలేక, చివరకు డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై మిగిలిపోవడం, కొందరు కేవలం రాజకీయాలకు పరిమితమై పార్టీ కార్యకర్తలుగా మిగిలిపోవడం చూశాడు వెంకటేష్. సమస్యల్లో చిక్కుకుని పరిస్థితులకు ఎదురీదలేక, అనారోగ్యంతోనో, ఆత్మహత్యలతోనో తనువు చాలించిన విషాదాలు ఎన్నో

    *కథనాలతో బాధితులకు అండగా నిలిచినా... నిజాయితీ గల జర్నలిస్టులకు ఓదార్పు కరువు.*

    ఇవి కూడా చదవండి

    వెంకటేష్‌ను గత తాలూకు గాయాలు తరుముతుంటే వెంకటేష్‌కు దుఃఖం తన్నుకొస్తుంది.
    సమాజంలో నెలకొన్న పరిస్థితుల్లో ఎంతోమంది పీడితుల పక్షాన మానవీయ కోణంలో అనేక కథనాలు రాసి, వారికి సమాజం నుంచో, ప్రభుత్వాల నుంచో ఎంతో కొంత ఆసరా కలిగించిన కొన్ని జ్ఞాపకాలు మనసుకు సంతోషాన్ని అందించాయి. కానీ తనలాంటి జర్నలిస్టుల బాధలకు ఎక్కడ కనీసం ఓదార్పు కూడా లేని పరిస్థితులను చూసి తనలో తానే నవ్వుకున్నాడు వెంకటేష్.కనీస వృత్తి భద్రత కూడా లేని రంగం అంటే కేవలం మీడియా రంగమే. ప్రింట్ మీడియానో, ఏ రంగమైనా ఎంతోమంది కనీస జీతభత్యాలు కూడా లేకుండా, ఉల్టా పత్రిక యాజమాన్యాల “టార్గెట్ల” పేరుతో కలెక్షన్ ఏజెంట్లుగా మారిన తోటి సహచరులు గుర్తొచ్చి మనసులోనే నొచ్చుకున్నాడు వెంకటేష్. పొద్దున వార్త సేకరించి సాయంత్రం డెస్క్‌కు పంపేసరికి తన ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో తెలియక కొంతమంది సహచర జర్నలిస్టుల్లో ఆవేదనను దగ్గరుండి చూశాడు వెంకటేష్.
    అప్పటికి జర్నలిస్టుల సమస్యలపై పనిచేసేందుకు అనేక యూనియన్లు ఉండేవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీడియా రంగంలో వచ్చిన పెద్ద మార్పు ఏంటంటే.. ఏకంగా రాజకీయ పార్టీల కార్యకర్తల స్థాయికి జారిపోవడం, అనుబంధ సంఘాలు ఏర్పాటు చేసుకునే స్థాయికి దిగజారిపోయిన పరిస్థితులు. అవి జర్నలిస్టుల సమస్యలను ఎట్లా పరిష్కారం చేస్తాయో అర్థం కాక, అనేక ప్రశ్నలను తనలో తానే వేసుకున్నాడు వెంకటేష్.

    *నాలుగో స్తంభం... రాజకీయ పార్టీల గుప్పిట్లో..*

    సమాజానికి నాలుగో స్తంభమైన “మీడియా”ను రాజకీయ పార్టీల వాకిట్లో కట్టేసిన పరిస్థితులను చూసి కొంచెం బాధపడ్డాడు వెంకటేష్. తాను కూడా జర్నలిస్టుల యూనియన్లలో నామమాత్రంగా మాత్రమే ఉన్నందుకు బాధా పడాల, లేక సంతోషమా పడాల.. అయినా మొక్కుబడిగా ఎందుకు కొనసాగుతున్నాడో అర్థం కాలేదు వెంకటేష్‌కు.ఎవరి స్వార్థం కోసం వాళ్లే యూనియన్లలో ఆధిపత్యం కోసం పాకులాడుతూ, చిట్టచివరకు స్వార్థ రాజకీయాలకు తలవంచుతున్న ఎంతోమంది జర్నలిస్టులుగా చలామణి అవుతున్న వాళ్లను చూశాడు వెంకటేష్. ఇట్లా ఆలోచిస్తూ పోతే వెంకటేష్ మెదడు అంతా మొద్దుబారినట్లు అయ్యింది. ఈనెల ఇంటి అద్దె కట్టేందుకు అప్పు ఎక్కడ చేయాలో అనుకుంటూ మనసులో ఆలోచిస్తూ ఇంట్లోంచి బయటకు వచ్చాడు వెంకటేష్..

    (పేర్లు కల్పితం.. పరిస్థితులు యథార్థం)

    ✍️ అల్లే రమేష్, , సిరిసిల్ల.

    అత్యధికంగా చదివినవి