EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • "యాదన్న" యాదికొచ్చిండు. ---- (చారిత్రక కథనం.)

    Author admin | 07 Oct 2026, 07:46 PM | TELANGANA
    "యాదన్న" యాదికొచ్చిండు. ---- (చారిత్రక కథనం.)

    "జ్ఞానేశ్వర్‌ను సుమారు వంద కిలోమీటర్లు దూరం నుంచి లాక్కొచ్చింది ఎర్ర జెండా మీద అభిమానం.జ్ఞానేశ్వర్ అరవై వయసు లోపు వాడైన ఎన్నో చారిత్రక పరిణామాలను చూసిండు. జిల్లాల సరిహద్దులు దాటుకుని ఓ మారుమూల గ్రామానికి రావడం వెనుక సమాజాన్ని ప్రేమించిన తరం జ్ఞాపకాల గుర్తులను తడిమి చూసుకోవడం కోసం ఇంత దూరం వచ్చాడు. తీరా ఇక్కడికి వచ్చాక పరిస్థితులు తాను ఊహించినట్టు లేకపోవడంతో బాదనిపించింది జ్ఞానేశ్వర్‌కు."


    *వేగుచుక్క న్యూస్:*

    సనుగుల గ్రామంలోకి అడుగుపెడుతూనే కనిపించిన అల్లూరి సీతారామరాజు విగ్రహం గతాన్ని దోసిళ్లతో పట్టి చూపుతున్నట్టె అనిపించింది. ఒకనాడు ఉవ్వెత్తిన ఏగాసిపడిన ప్రజా పోరాటాకు కిష్టంపేట మర్రిగడ్డ, రామారావు పల్లి, సనుగుల, రుద్రంగితో పాటు చుట్టుపక్కల గ్రామాలన్నీ ఎంతో చైతన్యంతో ఎగసి పడిన రోజులను ఆ తరం నాయకుల నిస్వార్ధమైన ఆచరణను యాది చేసుకున్నడు. ఇప్పుడు ఊర్లన్నీ తెచ్చి పెట్టుకున్న విద్వేష రాజకీయాలను మోస్తున్నట్లు ఉన్న తీరు చూస్తుంటే మనసులో తెలియని బాధ వెంటాడుతున్నట్లే అనిపించింది. ఈ పార్టీ నాయకులు, ఆ పార్టీ నాయకులు తిట్టడం, కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ పాత పార్టీలను ఉతికి ఆరేయడం తప్ప ప్రజలకు అవసరమైన రాజకీయాల ప్రస్తావనేది. సమాజంలో వస్తున్న మార్పులకు, రాజకీయాల ఉచ్చులకు బలవుతున్న తరాన్ని చూస్తుంటే జ్ఞానేశ్వర్ మనసంతా పిండేసినట్టు అయింది. మీటింగ్ జరుగుతున్న సభకు కొంచెం దూరంగా వెళ్లి ఒంటరిగా ఒక్కడే కూర్చున్నాడు.

    సనుగుల బస్టాండ్ కొంచెం దూరంలోనే రంగు వెలిసిపోయిన స్మారక స్తూపం కనిపించింది. స్తూపంలో ఎందరో సమాజం కోసం ప్రాణాలను పణంగా పెట్టి వీరుల త్యాగాలు ఎన్నో విషయాలను తనతో చెప్పుతున్నట్లే అనిపించింది. తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న తరం నడిపిన ఉద్యమాల రోజులన్నీ కండ్లముందు కనిపించాయి.
    సిరిసిల్ల రైతాంగ పోరాటాలే కాకుండా, ఆనాడు ఉమ్మడి రాష్ట్రాన్ని అల్లుకున్న ప్రతిఘటన పోరాటాల నేపథ్యం యాది కోచ్చింది. అట్లా ప్రగతిశీల రాజకీయాల వైపు నడిచిన తన జ్ఞాపకాలెన్నో మనసులో అలజడి సృష్టించినట్లు అనిపించింది జ్ఞానేశ్వర్‌కు.

    "ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కరీంనగర్, మెదక్ జిల్లా సరిహద్దు గ్రామాల్లో తనను ప్రభావితం చేసిన రోజులు ఆతరం విప్లవోద్యమం నాయకులను యాది చేసుకున్నాడు జ్ఞానేశ్వర్. అట్లా జ్ఞాపకాల పొరల్లో గోదావరిలోయంత ప్రతిఘటన పోరాటాలు పరిచి పెద్దన్న బాటలో నడిచిన ఆనాటి యువ నాయకులు యాదికొచ్చిండ్రు. అట్లా జ్ఞాపకాలను తడిమి చూస్తుంటే తనపై ఎంతో ప్రభావం చూపిన "యాదన్న" యాదికొచ్చిండు. అదంతా పరవళ్లు తొక్కిన పది వసంతాల కాలం. ఆ కాలం సాధారణ గ్రామీణులను ఎలా విప్లవ వీరులుగా మలిచిందో అన్న విషయాలను తలుచుకుంటేనే మనసు ఉప్పొంగినట్లు అనిపించింది జ్ఞానేశ్వర్‌కు."

    ఇవి కూడా చదవండి

    తాను పదో తరగతి చదువుతున్న కాలం 1987 అనుకుంటా. కొంచెం అటు ఇటుగా తాను చూసిన తరం నాయకులను తనను ప్రభావితం చేసిన సందర్భాలు, సమాజం కోసం వారు తపన ఒక్కొక్కటిగా జ్ఞానేశ్వర్‌కుయాదికొస్తున్నాయి. ఎక్కడో నల్లగొండ జిల్లా ప్రాంతంలో లచ్చమ్మ గూడెంలో పుట్టి, శ్రమైక జీవనంతో పెనవేసుకుని, వలస కార్మికుడిగా ప్రారంభమై, దోపిడీ పీడన లేని సమాజం కోసం, ప్రజల కోసం నడిచిన యాదన్న యాది కొచ్చిండు. ఊరి కోసం రాలేదు, పేరు కోసం రాలేదు, సమాజమే కుటుంబంగా భావించి యాదన్న అలియాస్ రమేష్ నిర్మించిన పోరాటాలు యాదికొచ్చినయ్. కామారెడ్డి ప్రాంతం నుంచి జగిత్యాల దాకా యాదన్న నిర్మించిన పోరాటాలు యాదికొచ్చినయ్. ఎక్కడ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే అక్కడ చిరునవ్వై పలకరించి అండగా నిలిచిన యాదన్న యాదికొచ్చిండు. యాదన్నతో తనకు పెనవేసుకున్న జ్ఞాపకాలు నిన్న మొన్న జరిగినట్టే అనిపిస్తుంది. విద్యార్థిగా ఉన్న కాలంలోనే తనపై తీవ్రంగా ప్రభావం చూపిన అనేక సందర్భాలను యాది చేసుకున్నాడు జ్ఞానేశ్వర్.

    ఉవ్వెత్తున ఎగసిపడ్డ పోరాట కాలాన్ని చూసిండు. గాయపడ్డ పల్లె గుండెలను తాకిండు. ఇప్పటికీ కన్నీటి తడి తగులుతున్నట్లే అనిపిస్తుంది జ్ఞానేశ్వర్‌కు. క్రమక్రమంగా ఈ ప్రాంతంలో జారిపోయిన పోరాటాలు, మారిన రాజకీయ పరిణామాలు అన్నీ కండ్లముందు తిరుగుతున్నట్టు అనిపించింది. పల్లెల్లో పొద్దయి పొడిసిన యాదన్నతో పాటు ఎందరో ఆ తరం వీరులు యాదికొచ్చిండ్రు. జగిత్యాల ప్రాంతంలో పోరాట జెండాను ఎత్తిపెట్టిన యాదన్న ఆచరణ యాది చేసుకున్నాడు జ్ఞానేశ్వర్. తనలాంటి వాళ్లందరినో ఆనాడు విద్యార్థి ఉద్యమ నాయకులుగా మలిచిన తీరును, బీడీ కార్మికులతో పాటు అనేక రైతాంగ పోరాటాలకు ఊపిరి పోసిన యాదన్న యాదికొచ్చి కండ్లల్ల నీళ్లు తిరిగినయ్ జ్ఞానేశ్వర్‌కు. విమలక్క వచ్చినట్టుంది... మైక్‌లోంచి "వీరుల సన్నిధి" పాట వినిపిస్తుంది. తరం నుంచి తరం ఎత్తుకుంటున్న అరుణోదయ విమలక్కతో పాట ను కొత్త అందుకుంటున్న పాట వింటుంటే జ్ఞానేశ్వర్‌కు భవిష్యత్ తరం అమరుల త్యాగాలు, పోరాట వారసత్వాన్ని అందిపుచ్చుకుంటుంది అనే నమ్మకం పెరుగుతుంది. రంగులు వెలిసిపోయిన సనుగుల స్మారక స్తూపం కూడా ఆనాడు నిస్వార్థంగా ప్రజల కోసం నిలబడ్డ తరం త్యాగాలు తనతో పాటు ఎందరినో నడిపించిన రోజులను యాది చేసుకున్నాడు జ్ఞానేశ్వర్. ఇప్పటికీ యాదన్న ఇంకా మాట్లాడుతున్నట్లే అనిపించింది. నిజామాబాద్ నుంచి సిరిసిల్ల, జగిత్యాల పల్లెల్లో పొద్దయి యాదన్న చిరునవ్వుతో పలకరిస్తున్నట్లే అనిపించింది. తరాల త్యాగాలను కలబోసుకుంటూ ఇంటి దిక్కు తొవ్వ తీసిండు జ్ఞానేశ్వర్.

    ( ప్రజా పోరాటలలో ఎదిగొచ్చిన ఎందరో వీరుల చరిత్ర ఇప్పటి తరానికి అంది రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నల్లగొండ జిల్లా మారుమూల గ్రామం నుంచి పలాస కార్మికుడిగా వచ్చి ప్రజా పోరాటాలో ప్రత్యేక ముద్ర వేసి ఆనాటి ఉమ్మడి నిజామాబాద్ నుంచి జగిత్యాల దాకా పోరాట సాలు పోసి 1990 ప్రాంతంలో సెప్టెంబర్ 29 న అమరుడయ్యారు. ఆనాడు విద్యార్థిగా ఉన్న సమయంలో ఉన్న జ్ఞాపకాలని పంచుకున్న మిత్రుడి మాటల్లోంచి కథనం రూపుదిద్దుకోండి. యాదన్న తో పాటు ఆ తరం నాయకులకు వినమ్రంగ విప్లవ జోహార్లు).

    (పరిస్థితులు యథార్థం.. పేర్లు కల్పితం)

    ✍️ అల్లే రమేష్, సిరిసిల్ల.
    06. అక్టోబర్ 2026.
    .

    అత్యధికంగా చదివినవి